తెలంగాణలో పెండింగ్లో ఉన్న చలానాలు చెల్లించేందుకు వాహనదారుల కోసం డిస్కౌంట్ అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర సర్కార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వాహనదారులు పెండింగ్లో ఉన్న చలానాలు చెల్లించేస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది సైబర్ కేటుగాళ్లు ఈ డిస్కౌంట్ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి వాహనదారుల నుంచి చలానాలు కొల్లగొట్టేస్తున్నారు. డబ్బు చెల్లించినా చలానా అలాగే కనిపించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
కేవలం అక్షరం మార్పుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి నెట్టింట, సెల్ఫోన్లకు లింకులు పంపుతున్నారు. వాహనదారులు ఇది నిజమని భావించి నగదు చెల్లిస్తున్నారు. అనంతరం పోలీసుల వెబ్ సైట్‌లో పరిశీలిస్తే చలానాలు యథావిధిగా కనిపించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా బాధితుల ఫిర్యాదుతో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులు సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండేందుకు వాహనదారులు మీ-సేవ కేంద్రాలు, పేటీఎం వాలెట్, https://echallan.tspolice.gov.in/publicview/ ద్వారా చెల్లింపులు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.