తెలంగాణలో చేసిన ఫీవర్ సర్వే సంచలన నిజాలు తెలిపింది. సెకండ్ వేవ్ పెద్దగా తీవ్రత చూపట్లేదని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో నిజాలు భయాందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఎంతమందికి ఉన్నాయో గుర్తించడానికి ఫీవర్ సర్వే చేయించింది టీఆర్‌స్ ప్రభుత్వం. కాగా ఈ సర్వే విస్తుపోయే నిజాలు తెలిపింది.
ఈనెల 6నుంచి కరోనా లక్షణాలున్న వారిని గుర్తంచేందుకు ప్రభుత్వం ఫీవర్ సర్వేకు ఆదేశించింది. ఆశా కార్యకర్త, ఏఎఎన్ ఎం, గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి ఒకరు ఇలా నలుగురితో కలిపి కమిటీలు వేసింది. అయితే ఈ కమిటీలు కరోనా లక్షణాలున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నట్టు గుర్తించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 31వేల మందికి జ్వరాలు, దగ్గు, జలుబు ఉన్నాయని చెప్పింది.
అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్య నగరాల్లో కరోనా లక్షణాలు ఉన్న వారు లక్షల్లో ఉన్నట్టు విరవించింది. ప్రతి వంద మందిలో పది మందికి జ్వరం, దగ్గు లాంటివి ఉన్నాయని చెప్పింది. లక్షణాలున్న వారు 14రోజుల హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఈ టీం సభ్యులు సూచిస్తున్నారు. అలాగే జ్వరం, ఇతర విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చి పోతున్నారు. అయితే తమకు నిజంగానే కరోనా ఉందో లేదో తెలియక లక్షనాలున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమ వారికి దూరంగా ఉండాలో వద్దో అని భయపడుతున్నారు.