తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రైతుల రుణమాఫీ అమలుపై సర్కార్ కసరత్తు షురూ చేసింది. రుణమాఫీకి నిధుల సేకరణకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసిన సర్కార్.. ఆ నిధుల సమీకరణపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని, నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఆర్థిక శాఖ ఆ పనిలో పడింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోగా ఈ హామీని నెరవేర్చి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, ఖర్చు, రుణాలకు ప్రతి నెలా చెల్లించాల్సిన అసలు, వడ్డీ.. ఇలా అన్ని అంశాలను వివరించడంతోపాటు రుణమాఫీకి ఎంత మొత్తం అవసరమో కూడా ఈ సమావేశంలో అధికారులు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.