హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో సిబ్బందితో పాటు రోగులు, వారి కోసం వచ్చిన సహాయకులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అ యితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.