విద్యుత్ లైన్ల కు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయండని తెలంగాణ విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు. సంక్రాతి పండుగ నాడు పతంగులు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. సురక్షిత ప్రాంతాల్లో పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరం. ఒక వేళ విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే ఆ పతంగుల మాంజాలు విద్యుత్ లైన్లపై, ట్రాన్సఫార్మర్లపై పడి ప్రమాదాలు, విద్యుత్ అంతరాయాలు కలిగే అవకాశం ఉంటుందని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐ.ఏ.ఎస్ తెలిపారు.
విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్సఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయడం ప్రమాదకరం. ఒక వేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్ల పై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయం తో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం వున్నదని తెలిపారు. కాటన్, నైలాన్, లినెన్ తో చేసిన మాంజాలను మాత్రమే వాడండి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పడు విద్యుత్ షాక్ కలిగే అవకాశం వుందని పేర్కొన్నారు. ఒక వేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు/మాంజాలు తెగి పడ్డట్లు ఉంటే, విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు వున్నా, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ వారి 1912 కి గాని లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి గాని లేదా సంస్థ మొబైల్ ఆప్ ద్వారా గాని లేదా సంస్థ వెబ్సైటు www.tssouthernpower.com ద్వారా తమకు తెలియజేయగలరని ప్రకటన చేశారు.