వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం పై రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను తాము చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని… ఉద్యోగాల నియామకం, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందేనన్నారు. కాళోజీ కళాక్షేత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తైంది… ఎన్నికల కోడ్ ఉండటంతో మేము ప్రారంభించలేదని తెలిపారు. అడ్డిమార్ గుడ్డిదెబ్బలో గెలిచిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.
ఎమ్మెల్యే నాయికిని కాళోజీ చరిత్ర తెలుసా..? అని ప్రశ్నించారు. రాబోయే తరాలకు మంచి సాహిత్య వారసత్వాన్ని అందించాలని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి పునాది వేశామన్నారు. అంత కష్టపడి కాళోజీ పేరుతో కళాక్షేత్రం నిర్మిస్తే… కాంగ్రెస్ ప్రారంభం చేసుకుంటుందని విమర్శలు చేశారు. కాళోజీ కళాక్షేత్రాన్ని తామే నిర్మించామని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఏజెన్సీ తప్పిదంతో కళాక్షేత్రం నిర్మాణం ఆలస్యమైన మాట వాస్తవమన్నారు. కాళోజీ శతజయంతి ఉత్సవాలు జరిపిన ఘనత బీఆర్ఎస్ దేనని… ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడతామని ప్రకటించారు.