రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ వేదికగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు ఉద్యమపార్టీ అయిన బీఆర్ఎస్ కే తెలుసు అని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థం అయిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలేవో.. నీళ్లు ఏవో తెలిసిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జిల్లా పార్టీ ఆఫీసుల్లో శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈనెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. కేసీఆర్, హరీశ్ రావు, పిలుపు మేరకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ స్థలిని పరిశీలించారు.