తెలంగాణలో 14 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇందులో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గ్రామ సభల ద్వారా.. అప్లికేషన్ తీసుకుంది. ఈ అప్లికేషన్లు మొత్తం మూడు కేటగిరీలుగా విభజించి మొదటి మొదటి విడతలో A కేటగిరిలో భూమి ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. అనంతరం వివిధ దశల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సాయం తో పాటు ఇతర సామగ్రిని కూడా ప్రభుత్వం అందించనుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల కు ఉచితంగా ఇసుకను అందించాలని తెలంగాణ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటలపాటు స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని, ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయాలని సీఎం ఆదేశించారని
కలెక్టర్లకు, అధికారులకు తెలంగాణ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ చెప్పుకొచ్చారు. అలాగే ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే 9848094373, 7093914343 ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.