మూసీ నది ప్రక్షాళన.. ఎస్టీపీల నిర్మాణానికి రూ.3,849 కోట్లు మంజూరు

-

హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. మూసీ నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. ఇందుకోసం జలమండలికి పరిపాలన అనుమతులిస్తూ 3 వేల 849 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ అభివృద్ధి కోసం ఇటీవల బడ్జెట్‌లో 1500 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిధులతో నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్ పరిధిలో సుమారు 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల నుంచి డ్రైనేజీ నీళ్లు, వ్యర్థాలు కలుస్తుండటంతో మురికికూపంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మూసీని ప్రక్షాళన చేసి పరిసరాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని సంకల్పించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్ల రూపాయలతో ఒక ఎస్టీపీ నిర్మించనున్నారు. హామ్ పద్దతిలో 1878 కోట్లతో ప్యాకేజీ-1లో 16 ఎస్టీపీలు, 1906 కోట్లతో ప్యాకేజీ-2లో 22 ఎస్టీపీలను నిర్మించనుంది.  ఈ 39 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే.. 972  ఎంఎల్‌డీల మురుగునీటిని శుద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వీటికి టెండర్లను ఆహ్వానించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news