జంట నగరాల్లో ది ఫేమస్ హోటల్ అంటే ముందుగా గుర్తుచ్చే పేరు సికింద్రాబాద్ అల్ఫా హోటల్. ఇక్కడి చాయ్‌కు.. ఇతర వంటలకు నగర వాసులు ఫిదా అవుతుంటారు. సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండటంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. అయితే తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ హోటల్‌ను సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్ధాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో అల్ఫా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు మూసివేయించారు.
ఈ హోటల్‌పై ఈ నెల 15వ తేదీన కొంత మంది ఫిర్యాదు చేయడంతో పాటు పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్‌ను పరిశీలించి కొన్ని శాంపిల్స్ సేకరించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట గది పరిసరాలను గుర్తించారు. సేకరించిన ఈ శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్‌ఫుడ్ ల్యాబోరేటరీకి పంపించారు. అయితే, ఆదివారం మరోమారు అధికారుల బృందం హోటల్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో కూడా హోటల్ యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం లేదని, పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించారు. తదుపరి చర్యల కోసం యాజమాన్యం హోటల్‌ను మూసివేశారు.