హైదరాబాద్లో వినాయక చవితి సందడి షురూ అయింది. వాడకో గణేశ్ మండపంతో నగరం కళకళలాడుతోంది. ఎటుచూసినా డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, డీజే పాటలతో వీధులు మార్మోగుతున్నాయి. భాగ్యనగరంలో ది ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణపయ్య కొలువుదీరాడు. పండగ మొదలు కాకముందే ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఇక ఇవాళ వినాయక చవితి కావడంతో తెల్లవారుజాము నుంచే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట, తోపులాట చోటుచేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేశుడికి ఉదయం 9.30గం.కు ప్రాణప్రతిష్ఠ, కలశపూజ జరగనుంది. ఉదయం 11 గం.కు జరిగే తొలి పూజకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. గవర్నర్తో పాటు తొలి పూజలో హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొననున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.