పేద దంపతులకు శుభవార్త..ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో సంతాన సాఫల్య కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత హైదరాబాదులోని గాంధీ, పేట్లబుర్జు ఆసుపత్రులతో పాటు వరంగల్ లోని ఎంజీఎం లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఇంట్రయుటెరైన్, ఇన్సెమినేషన్(ఐయూఐ) తో పాటు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్.(ఇవిఎఫ్) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు లో కేంద్రాలు ఉన్నా.. ఐవిఎఫ్ పద్ధతిలో గర్భధారణకు కనీసం..రూ.3-4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పేద దంపతులు అంత ఖర్చు భరించలేని పరిస్థితి అయినా కొందరు అప్పులు చేసి మరీ చికిత్స చేయించుకుంటున్నారు.

వాస్తవానికి సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే జంటలకు కౌన్సిలింగ్ చేసి… సూచనలు,సలహాలు అందించాలి. పెళ్లయిన 1లేదా 2 ఏళ్లకు చాలామంది సరైన అవగాహన లేక ఇలాంటి క్లినిక్ లను సంప్రదిస్తుంటారు. ఇద్దరిలోనూ ఎలాంటి లోపం లేకపోతే ఐవిఎఫ్ అవసరమే ఉండదు. కొన్ని ప్రైవేటు క్లినిక్ లు లేనిపోని భయాలు కల్పించి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి ఉచితంగా సేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.