విజయదశమి పండుగ వేళ.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రతీ ఏడాది రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. సమాజాన్ని గొప్పగా నడిపించేలా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
మధిర నియోజకవర్గంలో విజయదశమి రోజున ప్రారంభించిన ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్ట్ విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. త్వరలో పేదల సొంతింటి కల సాకారం కానుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ కమిటీలో ఏడుగురు సభ్యులను నియమించనున్నట్టు వెల్లడించారు.