వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నీటమునిగింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరవాయిలో 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని మున్నేరు వాగు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు బిఆర్ఎస్ మాజీమంత్రి పువ్వాడ అజయ్.
జలమయమైన కాలనీలను, లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించి.. వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు పువ్వాడ. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు.
వాతావరణ శాఖ వారం రోజులుగా చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం ప్రజలకు సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రజలకు కనీస తాగునీరు కూడా అందించడం లేదన్నారు. అనుభవం ఉన్న మంత్రులు ఉన్నప్పటికీ విపత్తును ఎదుర్కోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇల్లు దెబ్బ తిన్నవారికి తక్షణమే ఐదు లక్షలు ఇవ్వాలని.. ఇంటి సామాన్ల కోసం రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.