తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 5 నాటికి పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా ఈ ఉపరితల ద్రోణి కొనసాగనుందని వివరించారు.
కోస్తాంధ్ర తీరానికి అతి చేరువలో ఏర్పడే అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలకు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా నిలిచి పోయాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లా జలమయం అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. వాగులు వంకలు పొంగి పొర్లడంతో రహదారులు తెగిపోయాయి. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేక అంధకారంలోనే ఉన్నాయి. పొంగి పొర్లుతూ వాగులు, వరదలలో చిక్కుకొని పలువురు మరణించారు. మరో 12 గంటల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందంటూ ప్రకటిస్తూనే.. మరో అల్పపీడన గండం కూడా పొంచి ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.