తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 11వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని తెలిపింది.
ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలని సూచించింది. సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన పత్రాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని హెచ్చరించింది.