తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు మధ్య ఈ పరీక్షను నిర్వహించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 2లక్షల 33వేల 248 మంది అభ్యర్థులే హాజరయ్యారు. గతేడాది జరిగి, రద్దయిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మందితో 79.15 శాతం హాజరు నమోదైంది. రెండోసారి నిర్వహించిన ఈ పరీక్షకు వారిలో దాదాపు 53 వేల మంది దూరంగా ఉన్నారు. రద్దయిన ప్రిలిమినరీతో పోలిస్తే ఈసారి ప్రశ్నలు కొంత సులువుగా వచ్చాయని నిపుణులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 61.37 శాతం హాజరు నమోదైంది. వివిధ శాఖల్లో 503 పోస్టుల కోసం 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3 లక్షల 9 వేల 323 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 2 లక్షల 33 వేల 248 మంది హాజరయ్యారు.గ త అనుభవాలతో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. పలు చోట్ల గందరగోళానికి దారి తీసిందని అధికారులు చెబుతున్నారు.