జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీక్షపరుల రాకతో కొండంతా రామ నామస్మరణతో మారు మ్రోగుతోంది. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న చెంతకు దీక్షా పరులు భారీగా చేరుకుంటున్నారు. ఇక్కడ మాలను విడిచి.. అంజన్నను దర్శించుకుంటున్నారు.
సోమవారం జయంతి ఉత్సవాలు ప్రారంభం కాగా బుధవారంతో ముగియనున్నాయి. రాష్ట్ర నలుమాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారి కోసం చలవ పందిళ్లు.. తాగునీటి సౌకార్యం, పారిశుద్ధ్య నిర్వహణతోపాటు 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల్లో వచ్చే వారి కోసం జేఎన్టీయూ వద్ద, బొజ్జ పొతన, గుట్టకింద మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకార్యం ఏర్పాటు చేశారు.
మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించారు. మెట్పల్లి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా జరిపారు. ఈ శోభయాత్రలో హనుమాన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.