రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ప్రచార వేగాన్ని పెంచారు. జెట్ స్పీడ్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సోమవారం ఒకే రోజు ఆదిలాబాద్, నిజామాద్, మల్కాజిగిరి.. మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇక ఈరోజు నాగర్కర్నూల్కు రేవంత్ వెళ్లనున్నారు.
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నేడు మల్లు రవి నామినేషన్ వేయనున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. మొదట ర్యాలీలో పాల్గొననున్న రేవంత్.. ఆ తర్వాత బిజినపల్లిలో నిర్వహించనున్న కాంగ్రెస్ ‘జనజాతర’ సభకు హాజరవుతారు. ఈ సభలో రేవంత్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే రేవంత్.. ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సోమవారం ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే మతాల మధ్య చిచ్చుపెట్టేలా అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్లలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ల పాలనలో పేదలు, మహిళలు, యువత ఆశలు నెరవేరలేదని అన్నారు.