రైతులకు కష్టకాలంలో అండగా నిలువాలని, చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాడుదామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, బీఆర్‌ఎస్ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన హరీశ్ రావు.. అన్నదాతలను ఆగం చేస్తూ అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. రోజుకోమాట మారుస్తూ మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కోరారు. కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలువాలని సూచించారు.
రోజూ పొద్దున, సాయంత్రం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలని, అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకోవాలని గులాబీ శ్రేణులకు హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. మిల్లర్లు, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులను సమన్వయం చేస్తూ వడ్లు కోనేలా చూడాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొనుగోలు విషయంలో ఎకడ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.