బండి సంజయ్ కు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తాపత్రయం : హరీశ్ రావు

-

భారత్ రాష్ట్ర సమితి లోక్ సభ సన్నాహక సమావేశాలు రెండో దఫా ఇవాళ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నాగర్కర్నూల్ సన్నాహక సమావేశం జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ నేతలు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మధుసూధనాచారి వారితో సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల ఓటమిపై సమీక్షతో పాటు లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని తెలిపారు. కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఎద్దేవాచ చేశారు.

మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని బ్రహ్మజ్ఞాని బండి సంజయ్ అంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర, పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని తెలిపారు. బండి సంజయ్ ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు తాపత్రయ పడతారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news