తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ వీరులను బలి తీసుకుని.. ఇప్పుడు రాష్ట్రానికి ఏదో చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారంటూ మండిపడుతున్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే అర్హత లేదంటూ విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్ర ప్రజల బతుకులు కటకటే అంటూ ఫైర్ అవుతున్నారు.
ఎన్నికలు అనగానే దిల్లీ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబంధులని..రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణపై రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే చదివిపోతున్నారని ఆరోపించారు. రాహుల్ లీడర్ కాదు.. జస్ట్ రీడర్ అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని…ఏ హోదాతో రాహుల్ చెబుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేనా? రాహులా? ప్రియాంకనా? అని అడిగారు. బీజేపీ బీఆర్ఎస్.. బీటీమ్ అని…. రాహుల్ చెప్పడంపైనా హరీశ్ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా బొరుసు అని ఆరోపించారు. రెండు పార్టీలు తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్‌కాదని ప్రజలకు ఏ టీమ్ అని పేర్కొన్నారు. ప్రజలే హైకమాండ్ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.