ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు అన్నారు. కర్ణాటకలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఆచూకీ లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ కర్ణాటక వెళ్లలేదని.. దిల్లీ నేతల హామీలు నమ్మితే మోసపోతారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఉన్న పథకాలకే కోత పెడుతున్నారని.. అక్కడ రోడ్లు వేయడానికే డబ్బులు లేవని డీకే శివకుమార్ అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని పేర్కొన్నారు.
“కాంగ్రెస్ పాలనలో కర్ణాటకలో అన్ని రంగాల్లో విఫలమైంది. ఆ రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి తెలంగాణను తీసుకొచ్చారు కేసీఆర్. కర్ణాటకలో రైతుబంధు ఇవ్వడం లేదు. ఆరు నెలల క్రితం చేసిన తప్పుకు కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు. అక్కడి ప్రజలకు కాంగ్రెస్ నరకం చూపిస్తుంది. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. గుండెపోటు గ్యారెంటీ” అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.