అధికారం రాదనే కాంగ్రెస్‌ బూటకపు హామీలు : మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. దీనిపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పందించారు. తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభ అలవికాని హామీలు, అబద్ధపు ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు, ఆత్మవంచన, పరనిందలతో సాగిందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి గ్యారెంటీల పేరిట కాపీ కొట్టారని హరీశ్ రావు మండిపడ్డారు. ఎలాగూ అధికారంలోకి రామని తెలిసే.. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్న చందంగా బూటకపు హామీలు ఇచ్చారని విమర్శించారు. రాహుల్‌గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో ఇలాగే అలవిగాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగమాగమవుతున్నారని హరీశ్ రావు తెలిపారు.

కాంగ్రెస్.. జాతీయ పార్టీనా లేక ప్రాంతీయ పార్టీనా.. హైదరాబాద్​లో ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు వేట కుక్కల్లా బీఆర్ఎస్ నేతలను వేధిస్తుంటే.. కాంగ్రెస్​కు సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసు మాత్రం ఎందుకు అటకెక్కిందని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news