ఈ శతాబ్దపు జల విజయం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం : హరీశ్ రావు

-

మరికొన్ని గంటల్లో పాలమూరు జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. పాలమూరు ప్రజలను కృష్ణమ్మ పరవళ్లు పలకరించబోతున్నాయి. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేసీఆర్ చేసిన కృషిని.. చూపిన పట్టుదలను బీఆర్ఎస్ మంత్రులు ప్రశంసిస్తున్నారు. తాజాగా కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు సాధ్యమైందంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హరీశ్ రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు. అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైందని.. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుందని తెలిపారు. ఉమ్మడి పాలనలో పాలమూరులో కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలస బతుకులు.. జీవనవిధ్వంసంతో పాలమూరు ప్రజలు నలిగిపోయారని గుర్తు చేశారు.

‘నాడు పాలకులు మారినా పాలమూరు బతుకులు మాత్రం మారలేదు. తాగు, సాగునీటికి తండ్లాట తప్పలేదు. కానీ పదేండ్ల స్వరాష్ట్రంలో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి సారథ్యంలో.. పాలమూరు దశ దిశ మారింది.. నదీజలాలు ఎదురెక్కుతూ.. చెరువులు తడలుగొడుతూ.. వాగులు జాలువారుతూ.. ఎండిన చేల దాహార్తిని తీర్చుతున్నాయి. పచ్చదనాన్ని పరుస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తితో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండడం గొప్ప విషయం. ఇది తెలంగాణ సాధించిన ఈ శతాబ్దపు అద్భుత విజయం. కేసీఆర్ గారి వల్లే సాధ్యమైన పాలమూరు జల విజయం.’ అని హరీశ్ రావు తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news