SLBC ఘటన.. కార్మికుల వెలికితీతలో ఎందుకింత జాప్యం?: హరీశ్‌రావు

-

నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) వద్ద సొరంగంలో కార్మికులు చిక్కుకుపోయి నేటితో నెల రోజులు గడుస్తోంది. అయినా ఇప్పటికీ అందులో చిక్కుకున్న ఏడుగురు ఏమయ్యారో తెలియని పరిస్థితి. వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఒక కార్మికుడి మృతదేహాన్ని వెలికి తీయడం తప్ప మిగిలిన ఏడుగురి జాడ గుర్తించలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. పొట్ట కూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెలికితీతలో ఎందుకింత జాప్యం జరుగుతోందని ప్రశ్నించిన ఆయన.. దీనిలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని విమర్శించారు. ఈ ప్రమాదానికి, బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న తీవ్ర వేదనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సొరంగంలో చిక్కుకుపోయిన మిగతా కార్మికుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బాధితులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news