చందాపూర్ పరిశ్రమలో మృతుల కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. నిన్న మంత్రులు వచ్చి పరామర్శించారే తప్ప ఫలితం లేదు…ప్రమాద ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని… తక్షణమే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి క్షతగాత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు లెక్క తేల్చాలని కోరారు.
నిన్న సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ పరిశ్రమలో పేలుడు వల్ల క్షతగాత్రులై ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… చందాపూర్ పరిశ్రమలో మృతుల కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి… చనిపోయిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
మంత్రుల పరామర్శలు కంటి తుడుపు చర్యలు పనికిరావు… మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి… క్షతగాత్రులకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.