అగమ్యగోచరంగా మారిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ గారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరమని తెలిపారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం, విదేశీ విద్యా పథకం కింద 780 మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రూ.20లక్షల చొప్పున ఖర్చు చేసింది. 436 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా 5,074 మందిని గుర్తించి, రూ.150 కోట్ల ఆర్థిక భరోసా కల్పించింది. ఇవే కాకుండా, బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ. 12 కోట్లతో పది ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా మీరు స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరుతున్నానని లేఖ రాశారు హరీష్‌రావు.