నిరుద్యోగుల డిమాండ్ల పై సీఎంకు హరీశ్ రావు లేఖ

-

కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్‌ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని హరీశ్‌రావు తెలిపారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు.

ప్రధానంగా గ్రూప్‌2, గ్రూప్‌ 3 పోస్టులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను గుర్తించి జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతిని కూడా వెంటనే చెల్లించాలన్నారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని, కేబినెట్‌ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశామని తెలిపారు. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్‌ సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news