ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ఐదుగురిని దోషులుగా.. ఇద్దరిని నిర్దోషులుగా కోర్ట్ ప్రకటించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. వీరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తేల్చింది.
తాజాగా సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా నమ్మాను. అందుకే తనకు న్యాయం జరిగిందని అన్నారు. తనకు న్యాయ వ్యవస్థలపై మరోసారి సంపూర్ణమైన నమ్మకం కలిగిందని చెప్పారు. గత 12 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఎమోషనల్ అయ్యారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చిందని తెలిపారు. కేసుల నెపంతో తనను రాజకీయంగా అణచివేయాలనుకున్నారు. అవినీతి చేశానని.. జైలుకు పోతానని హేళన చేసారని తెలిపారు.