ఛత్తీస్ గడ్ నుండి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నర్సింహా రెడ్డి కమిషన్ విచారణ పారదర్శకంగా జరడగంలేదని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషనన్ను రద్దు చేయాలని కేసీఆర్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.
కేసీఆర్ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉండగా.. కోర్టు సమయం ముగియడంతో ఈ పిటిషన్ విచారణను ధర్మాసనం రేపటికీ వాయిదా వేసింది. దీంతో కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని స్టేట్ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మొదటగా కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేసీఆర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించకపోవడంతో కేసీఆర్.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.