రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వంద శాతం చేసినట్లు చెప్పుకుంటుండగా.. తాజాగా మంత్రి దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలతో రుణమాఫీ అసంపూర్ణమని తేలిపోయిందని..ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో..పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.
‘సన్నాసులు ఎవరో..సమర్థులు ఎవరో..అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో..మేము కాదు.. మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడని కేటీఆర్ చురకలేశారు. రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని స్పష్టమైందని..మరి సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో లేదా కొడంగల్‌లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? అని కేటీఆర్ ప్రశ్నించారు.రైతు డిక్లరేషన్ ఓ బూటకం..సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దం..కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపమని’ కేటీఆర్ విమర్శించారు.