హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కురవడంతో రహదారుల పైకి వరద చేరి చెరువులను తలపించాయి. హయత్‌నగర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షంతో వరద పోటెత్తడం వల్ల చాదర్‌ఘాట్ నుంచి ఎల్బీ నగర్‌వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సండే కావడంతో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుదామని బయటకు వచ్చినవారు వర్షంలో తడిసిముద్దవుతున్నారు.
మరోవైపు ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలుల వీచే అవకాశమున్నట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ ప్రకటనతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది.