బీఆర్ఎస్.. గంగలో కలిసిన పార్టీ: బండి సంజయ్‌

-

గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేస్తోంది. ఈ వార్తలను ఇప్పటికే రెండు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ గంగలో కలిసిన పార్టీ అని  బండి సంజయ్‌ విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని బండి సంజయ్ అన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ చాలా దూరం అని వెల్లడించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారన్న బండి సంజయ్ .. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు. అందుకే కొంత మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైందని.. తమకు ఎవరి మద్దతు అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. ప్రజల మద్దతు ఉంటే చాలని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే కాంగ్రెస్ పార్టీ విలీన ప్రచారం మొదలు పెట్టిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version