తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాలు, వరదలు పోయినవి అనుకుంటుండగానే మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే రెండు గంటల్లో నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, హన్మకొండ, జనగామ, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇటీవలే కురిసిన వర్షాలకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వరదలతో పొంగి పొర్లాయి. ముఖ్యంగా మున్నేరు వాగు అయితే హైదరాబాద్-విజయవాడ రాకపోకలకు అంతరాయం కలిగింది. మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.