ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత నలిమెల భాస్కర్ 2024 కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ 09న కాళోజీ జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం చేయనున్నారు. 1956 ఏప్రిల్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ భాస్కర్ జన్మించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిగల్ నవలను నలిమెల భాస్కర్ ‘స్మారక శిలలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. నాటకాలు వేస్తూ ప్రేరణ పొందిన వ్యక్తే.. 14 భాషలపై పట్టు సాధించారు. నందిని సిధారెడ్డి పరిచయంతో సమాజంలో అసమానతలపై రచనల ద్వారా సమాధానం చెప్పారు నలిమెల భాస్కర్. మార్క్సిజం, కమ్యూనిజం పుస్తకాల పఠనంతో తన ప్రపంచాన్ని విశాలం చేసుకున్నారు. 25 ఏళ్ల వయసులో తన మేన మరదలిని వివాహం చేసుకున్నారు. రచయిత ఎప్పుడూ పసిమనసు కోల్పోవద్దని.. అలా ఆలోచించినప్పుడే సమాజహిత రచనలు చేయగలరని చెబుతుంటారు నలిమెల భాస్కర్.