తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు మొదలవుతాయి.
శాసనసభలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది.ఇక నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, గుంపులుగా వెళ్లడంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు ఉంటాయని… అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.