తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వానకు రాష్ట్రంలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు చేరడంతో చాలా వరకు ప్రాజెక్టుల గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు తెరిచి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం గుండి గ్రామంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
గుండిలో శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు అత్యధికంగా 213.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పుదురి గ్రామంలో 160 మి.మీ., గంగాధరలో 158.8 మి.మీ., బూరుగుపల్లిలో 143.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ సమీపంలో భారీ వరద కారణంగా నిర్మాణంలో ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.