ప్రజా పాలన దరఖాస్తు ఎలా నింపాలంటే?

-

కాంగ్రెస్ ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ‘ప్రజాపాలన దరఖాస్తు’ ఫారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత అయిదు పథకాల్లో ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. అన్ని పథకాలకూ అర్హులైనా ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో జత చేయాలి.

దరఖాస్తు ఎలా నింపాలంటే..

తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్‌ ఫోన్‌ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు ఏ విభాగంలోకి వస్తే అక్కడ టిక్‌ పెట్టాలి. కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్‌ నంబర్లు పేర్కొనాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా రాయాలి. కుటుంబ వివరాల తర్వాత అయిదు పథకాలకు సంబంధించిన వివరాల్లో ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్‌ చేయడంతో పాటు అందులో అడిగిన వివరాలు రాయాలి.

మహాలక్ష్మి- రూ.2,500 ఆర్థిక సాయం: ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే అక్కడ బాక్సులో టిక్‌ పెట్టాలి. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధి పొందాలంటే.. గ్యాస్‌ కనెక్షన్‌ సంఖ్య, సిలిండర్‌ సరఫరా చేస్తున్న గ్యాస్‌ కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు? అనే వివరాలు రాయాలి.

రైతుభరోసా: ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వ్యక్తి రైతా? కౌలు రైతా? టిక్‌ పెట్టి పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు. సాగు చేస్తున్న భూమి సర్వే నంబరు, సాగు విస్తీర్ణం లెక్కలు రాయాలి. మీరు వ్యవసాయ కూలీ అయితే ఉపాధి హామీ కార్డు నంబరు రాయాలి.

ఇందిరమ్మ ఇండ్లు : ఆర్థిక సాయం బాక్సులో టిక్‌ చేసి అమరవీరుల కుటుంబ సభ్యులు తమ పేరుతోపాటు.. అమరుడి పేరు, మృతి చెందిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్‌, డెత్‌ సర్టిఫికెట్‌ నంబరు వివరాలు రాయాలి. తెలంగాణ ఉద్యమకారులైతే కేసుల ఎఫ్‌ఐఆర్‌, సంవత్సరం, జైలుకు వెళితే ఆ సంవత్సరం, జైలు పేరు, శిక్షా కాలం వివరాలు ఫిల్ చేయాలి.

గృహజ్యోతి: మీ నెలవారీ విద్యుత్తు వినియోగం వాడకం 0-100 యూనిట్లు, 100-200 యూనిట్లు, 200 యూనిట్లపైన.. ఈ మూడింటిలో ఒక దాని ఎదురుగా టిక్‌ చేయాలి. గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ సంఖ్య రాయాలి.

చేయూత: కొత్తగా పింఛను కోరుతున్నవారు దివ్యాంగులైతే సంబంధిత బాక్సులో టిక్‌ చేసి సదరం సర్టిఫికెట్‌ సంఖ్య రాయాలి. ఇతరుల్లో.. వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదార్‌లలో.. ఎవరైతే వారికి సంబంధించిన బాక్సులో టిక్‌ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news