తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వచ్చే నెల మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. ఓవైపు సంక్రాంతి పర్వదినం, ఆపై సోమవారం కావడం.. మరోైపు మేడారం జాతరకు ముందు రాజన్నకే తొలి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుండటంతో ఆలయానికి పోటెత్తారు.
భక్తుల రద్దీతో కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకుని ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు. సమీపంలోని బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలిరావడంతో ఆలయం కోలాహలంగా మారింది . మేడారం జాతర నేపథ్యంలో దుకాణాల్లో ఎత్తు బంగారం (బెల్లం) కొనుగోళ్లతో వేములవాడ భక్త జనసందోహంగా మారింది.
మరోవైపు సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో మేడారంలోని సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. జాతరకు నెలరోజుల ముందే అమ్మవారి వద్దకు పోటెత్తుతున్నారు.