కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా నది తీరాన స్థానికులు ఎడ్ల పందేలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఇలా పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా నిర్వహించినట్లు చెప్పారు. ఈ పందేలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్ల వారంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు పందేల్లో పాల్గొనడానికి అంకుసాపూర్, బాబా పూర్, దడపాపుర్, పక్క జిల్లా అయినా మంచిర్యాల నుంచి రైతులు తరలివచ్చారు.
ఈ పోటీల్లో గెలిచిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా ఐదువేల ఒక్క రూపాయిలు ప్రకటించారు. ఇక సెకండ్ ప్రైజ్గా మూడువేల ఒక్క రూపాయి నజరానా ప్రకటించారు. మరోవైపు పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందించారు, గ్రామంలోని యువకులకు కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు. ఇలా ఊరు ఊరంతా కలిసి ఒకేచోట సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది.