వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు సోమవారం కావడంతో ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. గంటలు గడుస్తున్న కొద్దీ రద్దీ పెరుగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు గర్భాలయంలో అభిషేకాలు, అన్నపూజల సేవలు రద్దు చేశారు. మొక్కులు చెల్లించుకునే భక్తులకు 4 గంటలు సమయం పడుతోందని తెలిపారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులంతా తమ కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నారని వెల్లడించారు. మరోవైపు ఇవాళ సోమవారం కావడంతో భారీగా శివభక్తులు పోటెత్తారని వివరించారు. భక్తులంతా కోడె మొక్కులు చెల్లించుకుని శివయ్య దర్శనం చేసుకుంటున్నారని ఆలయ అధికారులు చెప్పారు.