ఒడిశా ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని తేల్చేందుకు రంగంలోకి ఇద్దరు కేంద్రమంత్రులు దిగారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్‌యాదవ్‌ను కేంద్ర పరిశీలకులుగా భారతీయ జనతా పార్టీ నియమించింది. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 12న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
కొత్త ముఖ్యమంత్రి రేసులో సీనియర్ బీజేపీ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఈయన దిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో పుజారి పేరు కూడా ఉందనే పుకార్లు షురూ అయ్యాయి. 2019 ఎన్నికల్లో బార్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రజారాజ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
ఇక ఒడిశాను రెండున్నర దశాబ్దాలపాటు పాలించిన బిజూ జనతాదళ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే.