యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఆలయంలో సోమవారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారు జాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తొలుత వైకుంఠ ద్వారం వద్ద స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పూజలు చేసి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయ ఈవో భాస్కరరావు, ధర్మకర్త నరసింహమూర్తి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలు పాల్గొన్నాయి. మరోవైపు యాదాద్రి క్షేత్రం గర్భాలయంలోని మూలవరులకు ఈరోజు ఉదయం అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఈ విశేష క్రతువును వేదమంత్రోచ్ఛరణల మధ్య చేపట్టారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.