హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్ఆర్) టెండర్ లో దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ స్కాం లో దాదాపు రూ.1000 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రపోజల్ పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓఆర్ఆర్ కి పునాదులు పడ్డాయని తెలిపారు. 158 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ ను ఏర్పాటు చేశారని వెల్లడించారు.
దేశంలో ఎక్కడా ఇలాంటి ఓఆర్ఆర్ సదుపాయాలు లేవని స్పష్టం చేశారు. 30 వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను రూ. 7,380 కోట్లకే కట్టబెట్టారని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. బిజెపి ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఓఆర్ఆర్ అక్రమాలపై సమీక్షిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ 30 ఏళ్లకు గంపగుత్తగా ఓఆర్ఆర్ ని అమ్మేశారని ఆరోపించారు.