హైదరాబాద్ లో ఆదివారం రోజున వరణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, ఘట్‌కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ తదితర అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
భారీ వర్షంతో హైదరాబాద్ లో ని హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం పెరిగింది. 513 అడుగులకు ఈ నీటిమట్టం చేరింది. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514 అడుగులు ఉండగా.. 513 అడుగుల వద్ద నీరు చేరి డేంజర్ స్థాయిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై హుస్సేన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే నగరంలోని కూకట్ పల్లి, బంజారా, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.