నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్వయంగా ప్రకటించారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎల్.ఎన్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 90 వ జయంతి వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ పోటీ చేసే స్థానాలపై కీలక ప్రకటన చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ ల మధ్య జరిగిన చర్చలు ఫలించి,పొత్తులు ఖరారయ్యాయని తెలిపారు.బీఎస్పీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చిందని తెలిపిన ఆయన నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ కలిసి సమిష్టిగా గెలుపు దిశగా పనిచేయనున్నాయని తెలిపారు.రాష్ట్రంలో బీఎస్పీ,బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతితో చర్చించిన తర్వాతే కీలక ప్రకటన చేసినట్లు వివరించారు. పొత్తులకు సహకరించిన పార్టీ అధినేత్రి కుమారి మాయావతి, పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ లతోపాటు తొడ్పాటునందించిన రాష్ట్ర కమిటీ సభ్యలకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.