యాదాద్రిలో కార్తీక శోభ వెల్లివిరిసింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం ప్రారంభం కావడం, ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపారాధనల కోసం భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
భక్తుల రద్దీ కారణంగా యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాలు భక్త జనసంద్రంగా మారాయి. ప్రధానాలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారి నిత్య పూజలు, నిత్య కల్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు స్వామి వారి సన్నిధిలో ఆయన్ను స్మరిస్తూ తరించిపోయారు. కాగా, భక్తుల రద్దీ తీవ్రతరం కావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు.