హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ ప్రాజెక్టు విజయగాథను ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్‌ఎస్‌ఐఆర్) తాజా సంచికలో ప్రచురించింది. ఒక భారతీయ మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) దీన్ని అభివర్ణించింది.
ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమల్లో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ ప్రచురిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల విస్తృత అధ్యయనాల గట్టిపోటీ నడుమ ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్ ఆచార్యులు రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుపై క్షుణ్నంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం కేస్ స్టడీగా ఎంచుకుంది. ప్రైవేటు పెట్టుబడులతో ప్రజాప్రయోజన ప్రాజెక్టుల నిర్మాణం ఏవిధంగా సాధ్యమో దీనిద్వారా అవగతమవుతుందని ఈ జర్నల్లో వెల్లడించింది.