హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. నగర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడానికి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నిశాఖల సమన్వయంతోనే అది సాధ్యం అవుతుందని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగులో కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని పలుచోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణాలు, సైన్ బోర్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఆమె సంబంధిత శాఖల అధికారులతో చర్చలు జరిపారు.
రాబోయే రోజుల్లో నగర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై కూడా ఆమె ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక విధుల నిర్వహణలో అధికారులు కచ్చితంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించవద్దని కూడా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.